Salman Khan: సల్మాన్ కు ఊరట... వాల్మీకులను అవమానించారన్న కేసులపై సుప్రీం స్టే
- సినిమా ప్రమోషన్ లో వాల్మీకులపై సల్మాన్ వ్యాఖ్యలు
- సల్మాన్ తమను అవమానించాడన్న వాల్మీకులు
- దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు కేసుల నమోదు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘టైగర్ జిందా హై’ సినిమా ప్రచారంలో భాగంగా వాల్మీకి కులస్తులపై సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. ‘టైగర్ జిందా హై’ ప్రమోషన్ లో సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై వాల్మీకి సామాజికవర్గానికి చెందిన పలువురు.. సల్మాన్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తమను అవమానించారని ఆరోపిస్తూ, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు కేసులు నమోదు చేయించారు.
దీంతో ఈ కేసులపై స్టే విధించాలని కోరుతూ సల్మాన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును విచారించి, స్టే విధించింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 23న జరుగుతుందని తెలిపింది.