India: పెరుగుతున్నది పైసల్లోనే... అయినా రికార్డు స్థాయికి 'పెట్రో' ధరలు!
- రోజువారీ ధరల సవరణను అమలు చేస్తున్న ఓఎంసీలు
- నిత్యమూ పైసల్లో పెరుగుతూ వస్తున్న ధరలు
- నాలుగేళ్ల గరిష్ఠస్థాయికి చేరిక
పెట్రోలు, డీజెల్ ధరలు మరింతగా పెరిగాయి. రోజువారీ సవరణను అమలు చేస్తున్న దేశవాళీ చమురు సంస్థలు తెలియకుండా వడ్డిస్తుండటంతో, నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకున్నాయి. ప్రతి రోజూ పైసలు చొప్పున పెరుగుతూ ఉండటంతో వినియోగదారులకు తెలియకుండానే ధరలు పెరుగుతూ, పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి.
కేవలం పది రోజుల వ్యవధిలోనే పెట్రోలు ధరలు 63 పైసలు, డీజెల్ పై 86 పైసల మేరకు ధరలు పెరగడం గమనార్హం. నేడు ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 74.63 ఉండగా, కోల్ కతాలో రూ. 77.32, ముంబైలో రూ. 82.48 వద్ద ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 79.04కు చేరింది. హైదరాబాద్ లో ఈ ధర గడచిన నాలుగేళ్లలోనే అత్యధికం. ఇక డీజెల్ విషయానికి వస్తే, ఢిల్లీలో రూ. 65.93, కోల్ కతాలో రూ. 68.63, ముంబైలో రూ. 70.20 వద్ద ఉండగా, హైదరాబాద్ లో రూ. 71.63 వద్ద కొనసాగుతోంది.
కాగా, ఈ నెల ప్రారంభంలో రోజుకు 11 నుంచి 19 పైసల వరకూ పెరుగుతూ వచ్చిన ధర ఆపై 1 పైసా నుంచి 5 పైసల మేరకు పెరిగింది. ఓ రెండు రోజుల పాటు పైసల్లోనే తగ్గిన పెట్రోలు, డీజెల్ ధరలు, గత మూడు రోజులుగా మళ్లీ పైకి లేచాయి. దీంతో డీజెల్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. పెట్రో ఉత్పత్తుల విక్రయాలు స్థిరంగా సాగుతూ ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.