Canada: అక్కడా, ఇక్కడా కాదు... డైరెక్టుగా తలలో కాల్చండి: పోలీసులతో ఉగ్రవాది!
- పాదచారులపైకి వ్యాన్ ఎక్కించిన అలెన్
- పోలీసులు చుట్టుముట్టిన వేళ చంపేయాలని వినతి
- చాకచక్యంతో అరెస్ట్ చేసిన కెనడా పోలీసులు
అద్దెకు తీసుకున్న వ్యాన్ ను వేగంగా పోనిస్తూ పాదచారులపైకి ఎక్కించి 10 మందిని పొట్టన బెట్టుకోవడంతో పాటు, 15 మంది గాయపడటానికి కారణమైన అమెరికన్ అలెన్ మినస్సియన్, తనకు ఎదురుపడిన పోలీసులను చూసి, మరెక్కడా కాల్చవద్దని, తన తలలోనే కాల్చాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపున్న ఓంటారియోలో జరిగిన ఈ ఘాతుకం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
మధ్యాహ్న భోజన సమయంలో అలెన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతన్ని హతమార్చకుండా ప్రాణాలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇంత పని చేయడానికి వెనకున్న కారణాలను విచారించే పనిలో పడ్డారు. ఒంటారియోలోని రిచ్ మాండ్ హిల్ ప్రాంతానికి చెందిన అలెక్ మినస్సియన్ వయసు 25 సంవత్సరాలని టొరంటో పోలీస్ చీఫ్ మార్క్ శాండర్స్ వెల్లడించారు. గతంలో ఎన్నడూ ఇతనిపై పోలీసు కేసులు లేవని చెప్పారు. పోలీసులు అతన్ని చుట్టుముట్టిన తరువాత, తన వద్ద ఓ ఆయుధం ఉందని చెబుతూ ఓ వస్తువును నేలపై పెట్టాడని, తనను తలలో కాల్చాలని అన్నాడని, కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అరెస్ట్ చేశారని చెప్పారు.