Narendra Modi: ప్రధానిని లేపేస్తానన్న కోయంబత్తూరు పేలుళ్ల దోషి.. తాజాగా అరెస్ట్!
- మనం మోదీని చంపాలనుకుంటున్నాం
- 1998లో అద్వానీ పర్యటించిన సమయంలో మనమే బాంబులు పెట్టాం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 8 నిమిషాల సంభాషణ
ప్రధాని నరేంద్ర మోదీని లేపేస్తామంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడంతో.. ఆ ఆడియో క్లిప్ ఆధారంగా కోయంబత్తూరు వరుస బాంబుపేలుళ్ల కేసులో శిక్ష అనుభవించిన మహ్మద్ రఫీక్ ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... 1998లో కోయంబత్తూరులో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 58 మంది మృతి చెందారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మహమ్మద్ రఫీక్ ని అరెస్టు చేసి నేరం నిరూపించారు.
దీంతో శిక్ష అనుభవించిన రఫీక్, ఆ తర్వాత విడుదలై తమిళనాడులోని కునియాముత్తూరు ప్రాంతంలో ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ గా స్థిరపడ్డాడు. ఇటీవల రఫీక్ మరొక వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాడు. 8 నిమిషాల ఆ సంభాషణలో తొలుత ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన వివరాలు మాట్లాడుకున్నారు. ఆ తరువాత 'మనం మోదీని చంపాలని అనుకుంటున్నాం. 1998లో ఎల్కే అద్వానీ పర్యటించిన సమయంలో కూడా మనమే బాంబులు పెట్టాం' అంటూ వ్యాఖ్యానించాడు.
ఈ ఆడియో టేపు వెలుగు చూడడంతో సోషల్ మీడియాలో ఆ సంభాషణ వైరల్ గా మారింది. దీంతో నిందితుడు మహమ్మద్ రఫీక్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, దీనిపై ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు