Pakistani: గుండె జబ్బుతో బాధపడుతున్నాను.. సాయం చేయండి!: భారత్ కు పాక్ దిగ్గజ హాకీ క్రీడాకారుడు విజ్ఞప్తి
- అనారోగ్యంతో బాధపడుతున్న పాక్ హాకీ దిగ్గజ క్రీడాకారుడు
- భారత్ ఆదుకోవాలంటూ విన్నపం
- భారత్ లోనే గుండె సంబంధ సమస్యల శస్త్ర చికిత్సల సక్సెస్ రేట్ ఎక్కువ
- భారత్ ఖర్చు కూడా తక్కువే
తనకు భారత ప్రభుత్వం సాయం చేయాలని పాకిస్థాన్ హాకీ దిగ్గజ క్రీడాకారుడు మన్సూర్ అహ్మద్ కోరుతున్నాడు. హాకీ గోల్ కీపర్ గా మూడు ఓలింపిక్ పతకాలతో పాటు, ఆ దేశానికి ఎన్నో విజయాలను అందించిన మన్సూర్ అహ్మద్ దిగ్గజ క్రీడాకారుడిగా నీరాజనాలు అందుకున్నాడు. అయితే అనారోగ్యం కారణంగా ఆర్ధిక సమస్యల్లో ఉన్న అతన్ని అఫ్రిదీ ఫౌండేషన్ సంరక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కరాచీలోని జిన్నా పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు. ఆయనను పరీక్షించిన వైద్యుడు పర్వేజ్, గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సకు భారత్ లేదా కాలిఫోర్నియా వెళ్లాలని సూచించారు.
దీనిపై స్పందించిన మన్సూర్, తాను శస్త్రచికిత్స కోసం భారత్ వెళ్లాలనుకుంటున్నానని తెలిపాడు. భారత్ లోనే ఈ శస్త్రచికిత్స సక్సస్ రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. కాలిఫోర్నియాతో పోలిస్తే భారత్ లో ఖర్చు కూడా తక్కువని చెబుతూ, దయచేసి తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు. తాను ఆర్ధిక సాయం కోరడం లేదని, నైతిక సాయం కావాలని కోరాడు. ఇప్పటికే తన ఆసుపత్రి రిపోర్టులను ఇండియన్ ఎంబసీకి పంపించానని, తనకు వీసా కావాలని కోరాడు.
గతంలో తాను ఎంతో మంది భారతీయుల గుండెల్లో బాధను నింపానని తెలిపాడు. 1989లో ఇందిరా గాంధీ కప్ టోర్నీలో భారత్ ను ఓడించామని గుర్తు చేసుకున్నాడు. ఇంకా ఎన్నో టోర్నీల్లో తాము గెలిచి వారి బాధకు కారణమయ్యామని తెలిపాడు. తానిప్పుడు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని అన్నాడు. తాను గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం భారత్ రావాలనుకుంటున్నానని, తాను భారత్ వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. సుష్మాస్వరాజ్ స్పందించి మన్సూర్ కి వీసా మంజూరు చేయాలని అతని అభిమానులు కోరుతున్నారు. పాక్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి ఆయన చికిత్స నిమిత్తం లక్ష డాలర్ల సాయం ప్రకటించారు.