suddala ashok teja: ఆశ్చర్యం .. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది!: సుద్దాల అశోక్ తేజ
- సైకిల్ పై వెళుతూ అలా అనుకునేవాడిని
- నాలో నేను మాట్లాడుకునేవాడిని
- దాసరిగారు పిలిచి అవకాశం ఇచ్చారు
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "నేను స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు .. స్కూల్ కి సైకిల్ పై వెళ్లేవాడిని. అలా వెళుతూ దర్శకులు దాసరి నారాయణరావుగారితో మాట్లాడుతున్నట్టు అనుకునేవాడిని.
"దాసరి గారు నన్ను పిలిపించారు .. నేను వెళ్లి ఆయనకి నమస్కరించాను. నువ్ పాటలు చాలా బాగా రాస్తావట గదా? అని ఆయన నన్ను అడిగారు. ఒక పాట వినిపించమని అడిగితే వినిపించాను. మెచ్చుకోలుగా ఆయన నన్ను దగ్గరికి తీసుకుని నీ విషయం నేను చూసుకుంటాను" అన్నట్టుగా ఊహించుకునే వాడిని. నేను అనుకున్నట్టుగానే దాసరి గారు నన్ను ఆఫీసుకి పిలిపించి అట్లాగే ప్రశ్నలు అడిగారు .. అట్లాగే నేను పాటలు వినిపించాను. అట్లాగే ఆయన 'నేను నిన్ను చూసుకుంటాను రా' అంటూ 'ఒసేయ్ రాములమ్మ' సినిమాలో 7 పాటలు రాసే అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు .