anam vivekananda reddy: ఆనం వివేకానందరెడ్డి జీవిత విశేషాలు.. చిరంజీవితో కలసి నటించడం మిస్ అయింది!
- ఆనంకు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలంటే పిచ్చి
- ప్రతి రోజు మధ్యాహ్నం బిర్యానీ ఉండాల్సిందే
- పంచ్ డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ఆనం దిట్ట
రాజకీయ నేతగా కంటే కూడా తన లైఫ్ స్టైల్ తోనే ఆనం వివేకానందరెడ్డి చాలా పాప్యులర్ అయ్యారు. ఆయన నడవడిక, మాట్లాడే తీరు, ప్రత్యర్థులను విమర్శించే తీరు అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో వివేకా జన్మించారు. నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఆనం వివేకా మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుచరులు ఆయనను టైగర్ అని ముద్దుగా పిలిపించుకుంటారు.
నెల్లూరులో చిన్న పిల్లాడికి కూడా వివేకా తెలుసంటే అతిశయోక్తి కాదు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా ఆయన వద్దకు వెళ్లేంత పరిస్థితి అక్కడ ఉంది. వాక్చాతుర్యంలో వివేకాను మించినవారు లేరనే చెప్పాలి. ఆయన వేసే సెటైర్లు అందరికీ కడుపుబ్బ నవ్వును తెప్పించేవి. ఆయనకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలంటే ఆయనకు ప్రాణం. చివరి వరకు కూడా ఆయన వీరి సినిమాలను ప్రతి ఉదయం చూసేవారు.
మెగాస్టార్ చిరంజీవి నెల్లూరుకు వచ్చినప్పుడు... మీ 150వ చిత్రంలో మీతో కలసి నటించాలని ఉందని నేరుగా మెగాస్టార్ ను ఆయన అడిగారు. చిరంజీవి కూడా దానికి సమ్మతం తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు, నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్ అనే వ్యక్తి ఆనంతో సినిమా తీసేందుకు అంతా రెడీ చేసుకున్నారు. కాని చివరి క్షణంలో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆనం జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉందంటే... అది సినిమాల్లో నటించకపోవడమే అని చెప్పొచ్చు.
ఆయనకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు మధ్యాహ్నం ఆయనకు బిర్యానీ ఉండాల్సిందే. ఇక ఆయన పొగ తాగే స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన విసిరే విమర్శలు కూడా చాలా ఘాటుగా ఉండేవి. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఆయన స్టైల్. ప్రస్తుతం ఆయన 'ఇక లేరు' అనే విషయాన్ని ఆయన అభిమానులు, మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.