Jagan: పులివెందుల వద్ద కృష్ణా నీటిని తలపై చల్లుకుంటే జగన్ పాపం పోతుంది: మంత్రి దేవినేని
- ‘పోలవరం’ ఎత్తు పెరుగుతుంటే ప్రతిపక్ష నేత గుండెల్లో గుబులు పుడుతోంది
- జగన్ పాదయాత్రలో చిత్తశుద్ధి లేదు
- చంద్రబాబు పాదయాత్రలో నిజాయతీ ఉంది
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి దేవినేని ఉమా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాలో మాట్లాడుతూ, ‘పోలవరం’ ఎత్తు పెరుగుతుంటే ప్రతిపక్ష నేత గుండెల్లో గుబులు పుడుతోందని, 4.71 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేశామని చెప్పారు. గురువారం లోటస్ పాండ్ కు, శుక్రవారం కోర్టుకు వెళ్లడం మాని, పులివెందుల వద్ద కృష్ణా నీటిని తలపై జగన్ చల్లుకుంటే ఆయన పాపం పోతుందని అన్నారు. జగన్ పాదయాత్రలో చిత్తశుద్ధి లేదని, వైఎస్, చంద్రబాబు పాదయాత్రలో నిజాయతీ ఉందని చెప్పారు.
బీజేపీ, వైసీపీ కుట్రలో భాగంగానే బీసీలను తప్పుదారి పట్టిస్తున్నారు
టీడీపీతోనే బీసీలకు గుర్తింపు వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీజేపీ, వైసీపీ కుట్రలో భాగంగానే బీసీలను తప్పుదారి పట్టిస్తున్నారని, వైసీపీ డైరెక్షన్ లో జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన్ని జగన్ పావుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పద్నాలుగేళ్లుగా జస్టిస్ గా ఉంటూ బీసీలకు ఈశ్వరయ్య ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు పలికారు.
వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ నాశనమైనట్టే
టీడీపీకి చెందిన మరో నేత బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, జగన్ ఆస్తుల కోసం బీజేపీకి వైసీపీని తాకట్టు పెట్టారని, వారానికోసారి కోర్టులకు వెళ్లే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. జగన్ పాదయాత్రలో రూ.300, బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారని, ఆదర్శ రాజకీయం అంటే సీఎం పదవి కోసం..తండ్రి చనిపోయాక సంతకాలు సేకరించడమా? అని ప్రశ్నించారు. వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ నాశనమైనట్టేనని అన్నారు.