anam vivekananda reddy: ఎన్టీఆర్ తో సైతం కాంగ్రెస్ కు మద్దతు పలికేలా చేసిన ఆనం వివేకా!
- 1995 నవంబర్ 23న మునిసిపల్ స్టేట్ ఛాంబర్ ఎన్నికలు
- బరిలో టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, కాంగ్రెస్
- కాంగ్రెస్ ను గెలిపించిన ఆనం చతురత
రాజకీయాల్లో ఆనం వివేకానందరెడ్డి దూకుడు మరెవరికీ ఉండదనే చెప్పాలి. కాంగ్రెస్ కు బద్ధ శత్రువైన ఎన్టీఆర్ తోనే ఆ పార్టీకి మద్దతు పలికేలా చేయగలిగిన చతురత వివేకాది. వివరాల్లోకి వెళ్తే, 1995 నవంబర్ 23న మునిసిపల్ స్టేట్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. అప్పటికే ఎన్టీఆర్ తో విభేదించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. స్టేట్ ఛాంబర్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ తరపున వివేకా, టీడీపీ అభ్యర్థిగా మనోహర్, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున అప్పటి బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ వెంకట్రావు పోటీపడ్డారు.
ఈ మూడు పార్టీలు బరిలో ఉంటే టీడీపీ కచ్చితంగా గెలిచి ఉండేది. దీంతో, ఆనం వివేకా నేరుగా ఎన్టీఆర్ ను కలిశారు. పరిస్థితిని ఆయనకు వివరించారు. ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థిని ఉపసంహరించుకుని, కాంగ్రెస్ కు మద్దతు పలికితే చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థిని ఓడించవచ్చని చెప్పారు. వివేకా మాటలను విశ్వసించిన ఎన్టీఆర్... తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించారు. దీంతో, ఛాంబర్ అధ్యక్షుడిగా ఆనం వివేకా విజయబావుటా ఎగురవేశారు. అనారోగ్య కారణాలతో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.