NTR: బాలయ్య పట్టుబట్టారు... తేజ ఒప్పుకోలేదు...: 'ఎన్టీఆర్' బయోపిక్ పై రూమర్!
- ఎన్టీఆర్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తేజ
- హీరో బాలకృష్ణతో వచ్చిన విభేదాలే కారణం
- గుసగుసలాడుకుంటున్న టాలీవుడ్
నందమూరి బాలకృష్ణ హీరోగా దివంగత మహానేత ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించే బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్న దర్శకుడు తేజ, అనూహ్యరీతిలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న ప్రకటించి సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇంత అర్థాంతరంగా తేజ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎందుకు వదిలేశారన్న చర్చ సాగుతున్న వేళ, సినీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. తాను ఏ సినిమాలో నటిస్తున్నా, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చే హీరో బాలకృష్ణ, తేజ మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
గతంలో సూపర్ హిట్ అయిన 'వేటగాడు' చిత్రంలోని హిట్ సాంగ్ తో పాటు జయలలితతో ఎన్టీఆర్ చేసిన ఓ హిట్ డ్యూయెట్ ఈ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని బాలకృష్ణ చెబితే, అందుకు తేజ అంగీకరించలేదని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర చిత్రంలో 50 గెటప్పులను బాలయ్య ఫైనల్ చేయగా, వాటి మధ్య డ్యూయెట్లు పెడితే కథ చెడిపోతుందని తేజ అభిప్రాయపడ్డాడని, దాంతో పాటు బాలయ్య ఫైనల్ చేసిన గెటప్స్ ఆయన ఫిజిక్ కు సూట్ కావని కాడా తేజ చెప్పాడని సమాచారం.
తన స్క్రిప్టులో జోక్యం చేసుకోవడాన్ని ఇష్టపడని తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక తేజ తప్పుకోవడానికి మరో వర్షన్ ఏంటంటే, మే నెలలో 15 రోజుల షూటింగ్, ఓ సాంగ్ ను చిత్రీకరించాలని బాలయ్య కోరగా, చాలా హోమ్ వర్క్ చేయాల్సిన ప్రాజెక్టు కాబట్టి వెంటనే షూటింగ్ సాధ్యం కాదని తేజ తేల్చి చెప్పాడని, దీంతో బాలకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, తేజ తప్పుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా ఈ విషయంలో నిజమేంటన్నది అటు బాలయ్య నుంచి గానీ, ఇటు తేజ నుంచి గానీ స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.