osmania hospital: కేసీఆర్ బాగా పని చేస్తున్నారు.. దేవుడి దయ వల్ల మంచి మెజార్టీతో మళ్లీ గెలుస్తారు!: మంత్రి లక్ష్మారెడ్డితో ఓ పేషెంట్
- ఉస్మానియా ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- ఉస్మాన్ కేసరీగా తనను పరిచయం చేసుకున్న ఓ పేషెంట్
- మంత్రి లక్ష్మారెడ్డి చేతికి ఓ గులాబీ పువ్వుని అందజేసిన వైనం
- ‘మీ మంచి మాటలే మాకు సన్మానాలు’: లక్ష్మారెడ్డి స్పందన
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. క్యాజువాలిటీ, కార్డియాలజీ ఓపీ, కార్డియాక్ ఐసీయూ, డయాలసిస్ యూనిట్, పేషెంట్స్ అటెండెంట్స్ వెయిటింగ్ షెడ్లను ప్రారంభించారు. ఆయా విభాగాలను మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే రాజాసింగ్, టిఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి ప్రాంభించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి.. ఎదురుగా ఉన్న ఓ పేషంట్ దగ్గరకు వెళ్ళి పరామర్శించారు. ఉస్మాన్ కేసరీగా తనను తాను పరిచయం చేసుకున్న ఓ పేషెంట్ మంత్రి లక్ష్మారెడ్డి చేతికి ఓ గులాబీ పువ్వుని అందజేశాడు. తాను 20 ఏళ్ళ పాటు విదేశీ వ్యవహారాల పరిధిలోని గిడ్డా ఇండియన్ కౌన్సిల్లో ఎయిర్ పోర్ట్ కోఆర్డినేటర్‌గా, ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పని చేశానని, రెండేళ్ళుగా తను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నానని, డయాలసిస్ పై బతుకుతున్నానని చెప్పుకున్నాడు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గురించి ఆ పేషెంట్ ప్రస్తావించాడు.
సీఎం కేసీఆర్ చాలా బాగా పని చేస్తున్నారు
‘కేసీిఆర్ సాబ్ నే అచ్ఛా కామ్ కర్ రహా హై. ఇన్షా అల్లా అవుర్ అచ్ఛా మెజార్టీ సే జీత్ జాయేంగే... ’ అంటూ ఆ పెద్ద మనిషి దీవించాడు. సీఎం కేసీఆర్ చాలా బాగా పని చేస్తున్నారని, దేవుడి దయ వల్ల ఆయన మరోసారి మంచి మెజార్టీతో గెలుస్తారని ఆ మాటలకు అర్థం. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం కూడా ఆ పేషెంట్ ప్రస్తావించాడు. ‘సీిఎం కేసీఆర్ నాకు బాగా తెలుసు. ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రోజుల్లో కేసీఆర్ ఖాస్త్ దోస్త్ ఇబ్రహీం సాబ్తో పాటు తరచూ కలుస్తుండే వాడిని.. కానీ, ప్రస్తుతం కేసీఆర్ ని నేను కలవలేకపోతున్నందుకు బాధగా ఉంది. కేసీఆర్ ని కలవాలని ఉంది’ అని తన మనసులో మాటను చెప్పాడు.
అనంతరం, మంత్రి లక్ష్మారెడ్డితో ఆయన ముచ్చటించాడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్కారీ దవాఖానాలు చాలా బాగు పడ్డాయని, మంచి వైద్యం అందుతోందని చెప్పాడు. డాక్టర్లు, సిబ్బంది కూడా బాగా పని చేస్తున్నారు. ప్రత్యేకించి కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాలు ఓ వరం లాంటివని.. ఇంత మంచి పని చేస్తున్నందుకు సర్కార్‌ని, ఆ సర్కార్‌ని నడుపుతున్న కేసీఆర్‌ని, వైద్య మంత్రిగా లక్ష్మారెడ్డిని అభినందిస్తున్నట్టు చెప్పాడు. తనకు వైద్యం అందిస్తున్న వైద్యులు డాక్టర్ మనీషా సహాయ్ తదితరులను సన్మానించాలని కోరారు. మీ దీవెనలు ఫలిస్తాయి..
ఆ పేషెంట్ వ్యాఖ్యలపై లక్ష్మారెడ్డి స్పందిస్తూ.. ‘మీ మంచి మాటలే మాకు సన్మానాలు. మీ దీవెనలు ఫలిస్తాయి. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో నాతో సహా మంత్రివర్గం, అధికారులు, వైద్యులు, సిబ్బంది సహా ప్రజలకు మంచి చేసేందుకు కృషి చేస్తున్నాం. మీలాంటి పెద్దలు, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి’ అని ఆకాంక్షించారు.