Reliance: జియో నుంచి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 80 వేల ఉద్యోగాల భర్తీ!
- ఈ ఆర్థిక సంవత్సరంలోనే భర్తీ
- ఎక్కువ శాతం నియామకాలు కళాశాలల నుంచి వచ్చే రిఫరెల్స్ తోనే..
- దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో రిలయన్స్ జట్టు
టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే, ఈసారి ఖాతాదారులకు కాదు.. నిరుద్యోగులకు. ఈ ఆర్థిక సంవత్సరంలో 75 వేల నుంచి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో 1.57 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, ఈ ఏడాది మరో 80 వేల మందిని తీసుకోబోతున్నామని జియో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో రిలయన్స్ జియో జట్టు కట్టిందని పేర్కొన్న ఆయన 60-70 శాతం ఉద్యోగ నియామకాలు కళాశాలలు, ఉద్యోగుల నుంచి వచ్చే రిఫరల్స్ ద్వారానే ఉంటాయని పేర్కొన్నారు. సేల్స్ విభాగాల్లో ఉద్యోగుల వలసలు 32 శాతంగా ఉందని, సగటున ఇది 18 శాతం మాత్రమేనని సంజయ్ తెలిపారు. సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.