FACEBOOK: విచారణకు రండి... ఫేస్ బుక్ చీఫ్ కు భోపాల్ కోర్టు సమన్లు
- భోపాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త పిటిషన్
- ఫేస్ బుక్ కు యాడ్ ఇస్తే అర్థాంతరంగా ఆపేసింది
- తిరిగి తనకే లీగల్ నోటీసులు పంపిందంటూ ఆవేదన
సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ‘దిట్రేడ్ బుక్ డాట్ ఓఆర్ జీ’ సంస్థ వ్యవస్థాపకులు స్వప్నిల్ రాయ్ కోర్టును ఆశ్రయించారు. ప్రకటన వేయాలంటూ ఫేస్ బుక్ కు డబ్బులు చెల్లించగా, ఒప్పందానికి విరుద్దంగా ఫేస్ బుక్ వ్యవహరించిందని, మూడు రోజులే ప్రకటనలు వేసి ఆ తర్వాత ఆపేసిందని కోర్టుకు తెలిపారు.
పైగా పేరు అభ్యంతరకరంగా ఉందంటూ ప్రకటన ఇచ్చిన తనకు ఫేస్ బుక్ లీగల్ నోటీసులు పంపినట్టు చెప్పారు. ఫేస్ బుక్ వ్యవహార శైలితో మానసికంగా కలత చెందుతున్నట్టు ఆమె కోర్టుకు తన బాధను తెలియజేశారు. దీంతో విచారణ కోసం ఈ నెల 20న కోర్టుకు హాజరు కావాలని భోపాల్ లోని అదనపు సెషన్స్ జడ్జి పార్థాశంకర్ మిశ్రా ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ కు సమన్లు పంపారు.