CBI: ఉన్నావో రేప్ కేసు నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యేకు లైంగిక సామర్థ్య పరీక్ష!
- విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతున్న సెంగార్
- లై డిటెక్టర్ పరీక్షలకు అనుమతి కోరనున్న సీబీఐ
- ఇప్పటికే కోర్టులో పిటిషన్
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉన్నావో రేప్ కేసు ఘటనలో ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ కు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. 12 రోజులుగా విచారిస్తున్నా ఆయన పొంతన లేని సమాధానాలతో విచారణకు సహకరించడం లేదని, దీంతో తిరిగి కోర్టు ముందు ఆయన్ను ప్రవేశపెట్టి, లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు అనుమతి కోరనున్నామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
అందుకు సంబంధించి ఇప్పటికే పిటిషన్ వేశామని, దానికి అనుబంధంగా లైంగిక సామర్థ్య పరీక్షలను నిర్వహించేందుకూ అనుమతి కోరనున్నామని అన్నారు. కాగా, సెంగార్ తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపించడం, ఆపై ఆమె తండ్రి పోలీసు స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.