banks: రేపటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులు తెరచుకోవు!
- రేపు నాలుగో శనివారం
- ఎల్లుండి ఆదివారం
- సోమవారం బుద్ధ పూర్ణిమ
- మంగళవారం మే డే
బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఖాతాదారులు ఈ రోజే ముగించుకోవాలని తొందర పడుతున్నారు. ఎందుకంటే రేపు నాలుగో శనివారం.. ఎల్లుండి ఆదివారం కావడంతో కొన్ని బ్యాంకులకు ఎప్పటిలాగే సెలవులు ఉండనున్నాయి. అలాగే, ఆ తరువాత సోమవారం బుద్ధపూర్ణిమ, మంగళవారం మే డే (కార్మిక దినోత్సవం) కావడంతో బ్యాంకులు తెరచుకోవు.
వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తుండడంతో ఖాతాదారులు ఈ రోజే జాగ్రత్త పడుతున్నారు. అయితే, ఈ వరుస సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండే అవకాశం లేదని తెలిసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం బుద్ధపూర్ణిమ రోజున మాత్రం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాలో బ్యాంకులు తెరచుకోవు.
ఇక మే డే(వచ్చేనెల 1) తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గోవాల్లో బ్యాంకులు తెరచుకోవు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.