kathua: కథువా రేప్ కేసులో విస్మయపరిచే కొత్త కోణం.. కుమారుడి దుర్మార్గం బయటపడకూడదనే బాలిక హత్య
- బాలికను చంపిన కారణం వివరించిన ప్రధాన నిందితుడు
- ముస్లింలను ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టేందుకే బాలిక కిడ్నాప్
- బాలికపై నిందితుడి కుమారుడు, మేనల్లుడు అత్యాచారం
కథువా రేప్ కేసు ఘటనలో విస్మయపరిచే మరో కోణం వెలుగు చూసింది. ఎనమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడైన సాంజిరామ్ సంచలన విషయాన్ని వెల్లడించాడు. కుమారుడి దుర్మార్గం బయటపడకూడదనే బాలికను హత్య చేసినట్టు పోలీసులకు తెలిపాడు. హిందువుల ప్రాబల్యం కొనసాగుతున్న ప్రాంతం నుంచి ముస్లిం సంచారజాతి వారిని తరమికొట్టాలనే ఉద్దేశంతో బాలికను అపహరించినట్టు చెప్పిన సాంజీరామ్.. బాలికపై తన కుమారుడు, మేనల్లుడు కలిసి అత్యాచారం చేసినట్టు తెలిపాడు. ఈ విషయం బయటపడ కూడదనే బాలికను హత్య చేసినట్టు అంగీకరించాడు.
ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టరాదని ఆదేశించింది. ఈ కేసు విచారణను జమ్మూకశ్మీర్ కోర్టుల్లో చేయవద్దని, చండీగఢ్ కు బదిలీ చేయాలని, సీబీఐకి అప్పగించాలని బాధితురాలి తండ్రి కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలోనే ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.