kanna babu: నిర్ణయం మార్చుకోలేనన్న కన్నబాబు.. టీడీపీ చర్చలు విఫలం!
- టీడీపీలో కొనసాగలేను
- మా కుటుంబానికి గౌరవం కూడా ఉండదు
- 5వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నా
విశాఖపట్నం జిల్లా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీలో చేరడం ఖరారైంది. వచ్చే నెల 5వ తేదీన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీలోనే ఉండాలంటూ ఆయనకు గంటా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీలో కొనసాగలేనని గంటాకు కన్నబాబు స్పష్టం చేశారు.
భేటీ అనంతరం మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ, గంటా శ్రీనివాసరావును రాజకీయ కారణాలతో తాను కలవలేదని... ఆయన తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఎలాంటి కండిషన్లు లేకుండానే 2014లో తాను టీడీపీలో చేరానని... అయితే, తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వయసు 65 సంవత్సరాలని... రాజకీయంగా ఇప్పుడు స్థిరపడకపోతే తన కుటుంబానికి గౌరవం కూడా ఉండదని చెప్పారు. వైసీపీలో చేరాలని తాను గట్టి నిర్ణయం తీసుకున్నానని... ఆ నిర్ణయాన్ని మార్చుకోలేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గంటాకు కూడా చెప్పానని అన్నారు.