Mumbai Indians: చిన్నబోయిన చెన్నై... ముంబైకి రెండో విజయం!
- పాయింట్ల పట్టికలో కదిలిన ముంబై ఇండియన్స్
- చెన్నై హోమ్ గ్రౌండ్ లో చిరస్మరణీయ విజయం
- 8 వికెట్ల తేడాతో గెలుపు
- హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
నిన్నటివరకూ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుని తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పకనే చెప్పింది. చెన్నైకి హోమ్ గ్రౌండ్ గా ఉన్న పుణె మైదానంలో అభిమానుల మద్దతును చూరగొన్న ముంబై, తమకు తొలి మ్యాచ్ లో షాకిచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా 8 వికెట్ల తేడాతో నెగ్గింది.
గత రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రైనా 75, అంబటి రాయుడు 46 పరుగులు చేసి రాణించారు. 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 170 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 33 బంతుల్లోనే 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలువగా, ఓపెనర్ లూయిస్ 43 బంతుల్లో 47 పరుగులు చేసి గెలుపులో కీలక బాధ్యతలు పోషించాడు. ఈ మ్యాచ్ తరువాత ముంబై ఇండియన్స్ జట్టు తానాడిన 7 మ్యాచ్ లలో 2 గెలుపులతో నాలుగు పాయింట్లు సాధించి, మెరుగైన రన్ రేటు కారణంగా పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.