Gagana: హైదరాబాదులో ప్రయాణికులను రోడ్డుపై వదిలేసి పారిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు!
- ప్రయాణికుల నుంచి భారీగా దోచుకునే ప్రైవేటు ట్రావెల్స్
- ఏసీ రావడం లేదన్నందుకు రోడ్డుపై రాత్రంతా పడిగాపులు
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రయాణికులు
ప్రయాణికుల నుంచి భారీఎత్తున దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తీసుకున్న డబ్బుకు తగినంత సేవ చేయడంలో మాత్రం విఫలమవుతూ చుక్కలు చూపిస్తున్నాయి. గత రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన రెండు ప్రైవేటు బస్సుల తీరును ప్రయాణికులు ప్రశ్నించగా, వారిని రోడ్డుపై వదిలేసి సిబ్బంది పారిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నం బయలుదేరిన గగన ట్రావెల్స్ బస్సులో ఏసీ పనిచేయడం లేదని, అద్దాలు మూసివున్న బస్సులో ఏసీ లేకుండా ఎలా ప్రయాణించాలని ప్రశ్నించినందుకు ఆ బస్సును లక్డీకపూల్ సమీపంలో వదిలేసి, మరో బస్సును తెస్తానని చెప్పిన డ్రైవర్ అటునుంచి అటే పారిపోగా, ప్రయాణికులు రాత్రంతా రోడ్డుపైనే వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఏసీ బస్సుకు డబ్బులు వసూలు చేసిన కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం, నాన్ ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ప్రయాణికులు డ్రైవర్ ను నిలదీయగా, బస్సును ఎల్బీ నగర్ వద్ద నిలిపేసి పారిపోయాడు. దీంతో చేసేదేమీ లేక వనస్థలిపురం పోలీసు స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.