Karnataka: కర్ణాటకలో అధికారం ఎవరికీ ఈజీ కాదు... స్పష్టం చేసిన మరో సర్వే
- ఫలితాల అనంతరం హంగ్ ఏర్పడుతుంది
- కింగ్ మేకర్ జేడీఎస్
- ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే
అతి త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఇదే సమయంలో మేజిక్ ఫిగర్ ను ఆ పార్టీ తాకే అవకాశాలు లేవని మరో సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ సాంకేతికత సాయంతో ఎన్జీ మైండ్ ఫ్రేమ్ అనే సంస్థ సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 105 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 75 నుంచి 85 సీట్ల మధ్య, జేడీఎస్ కు 35 నుంచి 41 సీట్ల వరకూ రావచ్చని తెలిపింది. ఇతరులు 4 నుంచి 8 స్థానాల్లో విజయం సాధిస్తారని చెప్పింది. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 25 మందిని భాగం చేస్తూ ఈ సర్వే చేసినట్టు తెలిపింది. ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోయిందని 65 శాతం మంది అభిప్రాయపడుతూనే, మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే తాము ఓట్లు వేయాలని భావిస్తున్నట్టు వెల్లడించినట్టు ఎన్జీ మైండ్ ఫ్రేమ్ పేర్కొంది.
ఇక సీఎంగా ఎవరు మెరుగైనవారన్న ప్రశ్నకు 41 శాతం మంది సిద్ధరామయ్యకు 33 శాతం మంది యడ్యూరప్పకు ఓటేసినట్టు తెలిపింది. జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ గా మారనుందని అంచనా వేసింది.