North Korea: ఉత్తర కొరియా కీలక నిర్ణయం.. మే నుంచి అణుపరీక్షలు బంద్!
- సమావేశమైన ఉభయ కొరియాల దేశాధి నేతలు
- కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ నిరాయుధీకరణకు నిర్ణయం
- అణ్వస్త్ర పరీక్షల కేంద్రాన్ని మూసివేయనున్నట్టు కిమ్ ప్రకటన
వరుస అణు పరీక్షలతో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన ఉత్తర కొరియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మే నుంచి తమ అణ్వస్త్ర పరీక్షల కేంద్రాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. ఆ ప్రక్రియను పరిశీలించేందుకు అమెరికా నిపుణులను ఆహ్వానించింది. ఆదివారం ఉభయ కొరియాల నేతలు కిమ్ జాంగ్ ఉన్-మూన్ జే ఇన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ నిరాయుధీకరణకు ఇరువురు నేతలు అంగీకరించారు. అందులో భాగంగా అణు పరీక్షలకు ఇక ఫుల్స్టాప్ పెడుతున్నట్టు కిమ్ ప్రకటించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు దక్షిణ కొరియాతోపాటు అమెరికా నిపుణులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు జపాన్‌తో చర్చలకు కిమ్ జాంగ్ సిద్ధంగా ఉన్నారని దక్షిణా కొరియా అధ్యక్షుడు మూన్ కార్యాలయం ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబేకు మూన్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం తెలిపారు. అతి త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-కిమ్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా నుంచి ఒక్కొక్కటిగా సానుకూల ప్రకటనలు వస్తుండడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలను నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు.