Chandrababu: నాటి మోదీ హామీకి ఆడియోలు, వీడియోలు సిద్ధం... నేటి చంద్రబాబు ప్రసంగంపైనే అందరి దృష్టి
- నేడు తిరుపతిలో చంద్రబాబు 'ధర్మపోరాట' దీక్ష
- నాలుగేళ్ల నాటి మోదీ హామీలు గుర్తు చేయడంపైనే దృష్టి
- రాష్ట్రాన్ని మోసం చేశారని చెప్పేందుకు నాటి ఆడియో, వీడియోలు సిద్ధం
- సాయంత్రం తిరుమలకు, అటునుంచి నేరుగా సభాస్థలికి చంద్రబాబు
సరిగ్గా నాలుగేళ్ల క్రితం... తిరుపతి వెంకటేశ్వరుని పాదాల సాక్షిగా, తానిచ్చిన హామీలను నరేంద్ర మోదీ తప్పడంతో, సీఎం చంద్రబాబునాయుడు నేడు అదే ప్రాంతంలో నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై 'ధర్మపోరాటం' చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రసంగంలో చంద్రబాబు ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని బీజేపీ చేస్తున్న ఆరోపణలతో పాటు, విపక్షాలు చేస్తున్న విమర్శలపైనా చంద్రబాబు తనదైన శైలిలో వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇదే సమయంలో నాటి బీజేపీ నేతల ప్రసంగాలు, ముఖ్యంగా మోదీ మాట్లాడుతూ హోదా, రైల్వేజోన్ అంశాలపై చేసిన ప్రసంగాల వీడియోలను చంద్రబాబు ప్రజలకు ప్రదర్శించనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ వైఖరిని ఎండగడుతూ, ఆ పార్టీతో నాలుగు సంవత్సరాలు ఎందుకు కలిసుండాల్సి వచ్చిందో ప్రజలకు చంద్రబాబే స్వయంగా వెల్లడిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా ఈ బహిరంగ సభ జరగనుంది. ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లే చంద్రబాబు, స్వామివారిని దర్శించుకుని, అక్కడి నుంచి సభాస్థలికి చేరుకుంటారు. కాగా, ఈ సభకు సుమారు లక్షన్నర మందిని తరలించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.