Guntur District: వేశ్యా వృత్తిని వదులుకుని, చాటింగ్ లో పరిచయమైన యువకుడితో సహజీవనం... అనుమానాస్పద స్థితిలో మృతి!
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
- హత్యేనన్న అనుమానంతో కేసు నమోదు
- పోలీసుల అదుపులో ప్రియుడు
వేశ్యావృత్తిలో ఉండి, పోలీసులకు పట్టుబడి, సంరక్షణ కేంద్రంలో కొంతకాలం ఉండి బయటకు వచ్చిన ఓ యువతి, ఫోన్ చాటింగ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో సహజీవనం చేస్తూ, అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన గుంటూరు నగరంలో జరిగింది. కలకలం రేపుతున్న ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, అరండల్ పేట లాడ్జి సెంటర్ సమీపంలోని ఓ బార్ ఎదురుగా ఉన్న గదిలో డేరంగుల శ్రీలక్ష్మి (21) అలియాస్ భాను అలియాస్ బంగారం అనే యువతి రెండు సంవత్సరాల నుంచి అఖిల్ తేజ అనే యువకుడితో కలసి ఉంటోంది.
ఫోన్ చాటింగ్ ద్వారా తనకు పరిచయమైన శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అఖిల్. ఇద్దరూ భార్యాభర్తలుగానే చుట్టు పక్కల వారికి పరిచయం. ఈ నెల 20న అఖిల్ హైదరాబాద్, వెళ్లి, శనివారం మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. ఇంట్లోంచి వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చేసరికి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృతదేహం పక్కనే కూల్ డ్రింక్, మజ్జిగ ప్యాకెట్లు ఉన్నాయి. లోపలినుంచి తలుపు గడియ పెట్టుకోకపోవడంతో ఇది హత్యేనన్న అనుమానాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమెకు కామెర్లు రావడంతో మజ్జిగ తాగమని చెప్పానని అఖిల్ చెబుతున్నాడు. ఇక ఆమెది మాచర్ల ప్రాంతమని, 2014లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని తేల్చిన పోలీసులు, ఆమె తల్లి చనిపోయిందని, తండ్రి ఎవరో తెలియరాలేదని వెల్లడించారు. దాచేపల్లిలో ఆమె తల్లికి సోదరుడు ఉన్నాడని, అయితే, ఆయన శ్రీలక్ష్మి మృతి సమాచారంపై అంతగా ఆసక్తిని చూపలేదని చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే బంధువులు ఎవరూ రాకపోవడంతో పంచనామా, పోస్టుమార్టం ఇంకా నిర్వహించలేదని అన్నారు. ఈ కేసులో అఖిల్ ను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నట్టు వెల్లడించారు.