International Market: కర్ణాటక ఎఫెక్ట్... ఆరు రోజులుగా మారని పెట్రోలు ధర... ఒక్కసారే బాదుడు!
- ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధర
- ధరలను సవరించని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు
- రోజువారీ ధరల మార్పు లేక ఆరు రోజులు
- ఎన్నికల తరువాత ఒక్కసారే బాదే అవకాశం
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో వస్తున్న మార్పులను అనుసరించి దేశవాళీ చమురు సంస్థలు రోజూ పెట్రోలు, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయన్న సంగతి వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే, గత ఆరు రోజులుగా 'పెట్రో' ఉత్పత్తుల ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. విడ్డూరమని అనిపించినా ఇది నిజం. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల సవరణ వద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరగా, ప్రభుత్వ ఆదేశాలను అవి పాటిస్తున్నాయని సమాచారం.
గత మంగళవారం నుంచి ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 74.63, డీజిల్ రూ. 65.93 వద్దే ఉంది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 79.04, డీజిల్ ధర రూ. 71.63 వద్ద కదలకుండా ఉంది. పెట్రోలు ధరల్లో మార్పు ఎందుకు లేదన్న విషయమై అటు పీఎస్యూ చమురు సంస్థల నుంచిగానీ, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ స్పందన లేదు. ఇటీవలి కాలంలో 'పెట్రో' ఉత్పత్తుల ధరలు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల కనిపించినప్పటికీ, ఆ ప్రభావం ఇండియా కస్టమర్లపై పడకుండా చమురు కంపెనీలు చూసుకుంటున్నాయి.
ఇక ఎన్నికలు ముగియగానే, ఒక్కసారే ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. గత సంవత్సరం జూలై నుంచి పరిశీలిస్తే పెట్రోలు ధర రూ. 11కు పైగా, డీజిల్ ధర రూ. 12కు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవద్దని చమురు కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం సర్వసాధారణమే. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికల వేళ కూడా పెట్రోలు ధరలను కొంతకాలం సవరించలేదు.