galla: జనసేన, వైసీపీకి ఆ విషయం తెలిసిపోయింది: గల్లా జయదేవ్
- ఇంత వరకు మోదీని మాత్రం ప్రశ్నించలేదు
- బీజేపీతో కలిసి ఉన్నట్లు ప్రజలకు తెలిస్తే ఓట్లు వేయరు
- కాబట్టి పైపైన విమర్శలు చేస్తున్నారు
ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను తాము ఈ రోజు గుర్తు చేస్తామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు తిరుపతిలో టీడీపీ నిర్వహించతలపెట్టిన 'ధర్మపోరాట సభ' ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "మనం పోరాటాన్ని కొనసాగిస్తున్నాం.. ఒక్కసారి చేస్తే అయిపోదు కదా.. ఇటీవల పార్లమెంటు లోపల, బయట కొట్లాడాం.. ఏపీలోని ప్రతి జిల్లాలోనూ కొట్లాడాం. నాలుగేళ్ల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడే కొన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ గుర్తు చేయాలనే ఈ ధర్మపోరాట సభ పెట్టాము.
ఈ సభ ముగిసిన తరువాత కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మోదీ ఆనాడు ఏయే హామీలు ఇచ్చారో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఆ హామీలను మేము ఈ రోజు గుర్తు చేస్తున్నామంతే. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తున్నారో ఇప్పుడు బీజేపీని కూడా అలానే చూస్తున్నారు.
జనసేన, వైసీపీ వాళ్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ, ఇంతవరకు మోదీని మాత్రం ప్రశ్నించడం లేదు. వారికి కూడా తెలిసిపోయింది.. బీజేపీతో కలిసి ఉన్నట్లు ప్రజలకు తెలిస్తే ఓట్లు వేయరు కాబట్టి.. ఏదో పైపైన విమర్శలు చేస్తున్నారు. వారి వెనుక ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు.