Sujana Chowdary: కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మితే నమ్మక ద్రోహం చేసింది: తిరుపతి సభలో సుజనా చౌదరి
- చట్టంలో పెట్టింది మాత్రమే చేయాలని అడుగుతున్నాం
- ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అడగడం లేదు
- బీజేపీ నేతలు ఏపీకి ఇప్పటికే చాలా చేశామంటున్నారు
- మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
విభజన చట్టంలో పెట్టింది మాత్రమే చేయాలని తాము అడుగుతున్నామని, ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అడగడం లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈ రోజు తిరుపతిలో నిర్వహించిన ధర్మ పోరాట సభలో ఆయన మాట్లాడుతూ... కొంతమంది బీజేపీ నేతలు ఏపీకి ఇప్పటికే చాలా చేశామని చెప్పుకుంటున్నారని అన్నారు. మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఏమయినా ఉపయోగపడుతుందేమోనని ఆనాడు ఊరుకున్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మితే నమ్మక ద్రోహం చేసిందని సుజనా చౌదరి అన్నారు. ఎన్డీఏపై పోరాటాన్ని మొదటి నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు వచ్చేవని అన్నారు. వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. చాలా ఓపిక పట్టి చివరికి నాలుగేళ్ల తరువాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశామని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర సర్కారుని నిలదీసి అడిగానని సుజనా చౌదరి అన్నారు. ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్ర సర్కారు కాలయాపన చేసిందని అన్నారు.