Chennai super kings: లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఢమాల్.. చెన్నై ఖాతాలో మరో విజయం
- చివరి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం
- ఉత్కంఠ పోరులో చెన్నైదే విజయం
- షేన్ వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఐపీఎల్‌లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి తన ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన 6 విజయాలు, 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగుల చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ మరోమారు చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఫా డుప్లెసిస్ 33 పరుగులు చేయగా, మూడో స్థానంలో బరిలోకి దిగిన అంబటి రాయుడు 41 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోనీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.
అనంతరం 212 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 198 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడి జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసినా, జట్టును ఓటమి కోరల్లోంచి తప్పించలేకపోయాడు.
విజయ్ శంకర్ 54 పరుగులు చేశాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి ధోనీ సేనదే పైచేయి అయింది. 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఐపీఎల్‌లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.