Tollywood: తెలుగు టీవీ న్యూస్ చానల్స్ ఎడిటర్ల ప్రత్యేక సమావేశం... టాలీవుడ్ కు హెచ్చరికలు!
- హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సమావేశం
- క్యాస్టింగ్ కౌచ్ నుంచి దృష్టిని మరల్చేందుకే ఆరోపణలు
- మీడియాపై దాడిని ఆపివేయాలని డిమాండ్
- ఏకగ్రీవ తీర్మానం ఆమోదం
ఇటీవలి కాలంలో కొందరు టాలీవుడ్ ప్రముఖులు తెలుగు టీవీ న్యూస్ చానల్స్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటం, కొన్ని టీవీ చానళ్లను నిషేధించాలని తమ అభిమానులకు పిలుపునిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న టీవీ చానళ్ల ఎడిటర్లు ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితులను చర్చించారు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ న్యూస్ చానళ్లు టీవీ9, టీవీ5, మహాన్యూస్, సాక్షి, ఎన్టీవీ, ఏబీఎన్ తదితర చానళ్ల ప్రతినిధులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు మీడియాపై చేస్తున్న దాడిని ఆపివేయాల్సిందేనని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ పై ప్రశ్నిస్తూ, చర్చలు పెట్టినందునే వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు మీడియాపై ఎదురుదాడికి దిగుతున్నారని వారు విమర్శించారు. మహిళా నటుల సమస్యలకు, ఆరోపణలకు పరిష్కారం చూపకుండా మీడియాపై అసత్య ప్రచారాలు చేయడం తగదని వారు హితవు పలికారు. అసలు వీరు సినిమా వారా? లేక కుల సంఘాల ప్రతినిధులా? అన్నది ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సినిమావారు మీడియాను టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానాన్ని, అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. క్యాస్టింగ్ కౌచ్ నుంచి బయటపడేందుకు, తమపై వస్తున్న విమర్శలను తప్పించుకునేందుకు మీడియాను నియంత్రించాలని భావిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని తెలుగు టీవీ వార్తా చానళ్లు ఏకగ్రీవంగా ఆమోదించాయి.