Warangal Rural District: అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆమ్రపాలి!
- స్వయంగా ఆదేశాలు ఇచ్చినా స్పందించని అధికారులు
- అసహనాన్ని వ్యక్తం చేసిన కలెక్టర్
- తొలితప్పుగా భావించి మందలింపుతో సరిపెడుతున్నానని వెల్లడి
తాను స్వయంగా ఆదేశాలు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని ఆసుపత్రుల సమీక్షలో భాగంగా సీఎంకే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఉర్సు ప్రసూతి ఆసుపత్రి నిర్వహణపై ఆర్ఎంఓ డాక్టర్ శివకుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ లు తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారని ఆమె మండిపడ్డారు.
మూడు వారాల క్రితం ఆసుపత్రిలో డిప్యుటేషన్ పై ఉన్న వైద్యుల సేవలను వినియోగించుకోవాలని, కాన్పులకు వచ్చే వారి కోసం స్కానింగ్ మెషీన్, నీటి శుద్ధి యంత్రాలు, జనరేటర్ కోసం అంచనాలు సమర్పించాలని సూచించినా, అధికారులు ఆ పని చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పాటించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేసిన ఆమె, తొలితప్పుగా భావిస్తూ ఇప్పటికి మందలించి వదిలేస్తున్నానని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.