KCR: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సంగతేంటి?: ఆరాతీసిన రాహుల్ గాంధీ
- ఇప్పటికే పలువురితో చర్చలు జరిపిన కేసీఆర్
- తనను కలిసిన వీహెచ్ ని వివరాలు అడిగిన రాహుల్
- టీఆర్ఎస్ కుమ్ములాటలు బయటకు రాకుండా నాటకాలే
- రాహుల్ కు వివరించిన వీహెచ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన తృతీయ కూటమి గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలను అడిగి ఆరా తీసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, కుమారస్వామిలతో పాటు మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చలు జరపడం, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ కానుండటం, త్వరలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో జరగనున్న కేసీఆర్ భేటీపై రాహుల్ అడిగి తెలుసుకున్నారు.
నిన్న ఢిల్లీలో రాహుల్ ను ఏఐసీసీ కార్యదర్శి వీ హనుమంతరావు స్వయంగా కలువగా, కేసీఆర్తో సమావేశమైన నేతలు ఫెడరల్ ఫ్రంట్ పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారని రాహుల్ అడిగినట్టు సమాచారం. కుటుంబం, పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతూ ఉండటంతో, వాటిని బయటపడకుండా చూసేందుకే కేసీఆర్ కూటమి పేరిట ముందుకు వచ్చారని తాను రాహుల్ కు వివరించానని ఈ భేటీ అనంతరం వీహెచ్ మీడియాకు తెలిపారు. కుమారుడు కేటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని కేసీఆర్ కు భార్య, కోడలు నుంచి ఒత్తిడి వస్తోందని, ఆ పని చేస్తే, తదనంతర పరిణామాలు, అంతర్గత కుమ్ములాటలు బయటకు వస్తాయని కేసీఆర్ భయపడుతున్నారని కూడా చెప్పినట్టు వీహెచ్ వ్యాఖ్యానించారు.