Chandrababu: సుజనాకు, చంద్రబాబుకు చెడిందిక్కడేనా?
- టీడీపీని సుజనా వీడుతున్నారని వార్తలు
- ఏడాదిన్నరగా చంద్రబాబుతో విభేదాలు
- కేంద్రం వద్ద విఫలమయ్యారని బాబు అసంతృప్తి
- యువ ఎంపీలకు ప్రోత్సాహంతో సుజనా మనస్తాపం
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని వచ్చిన వార్తలు కలకలం రేపుతుండగా, చంద్రబాబునాయుడితో వచ్చిన విభేదాల కారణంగానే సుజనా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆంగ్ల దినపత్రిక 'దక్కన్ క్రానికల్'లో ప్రచురితమైన సమాచారం మేరకు, గత ఏడాదిన్నర కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికలను వాయిదా వేయించాలని భావించిన చంద్రబాబు, ఆపని చేసి పెట్టాలని సుజనా చౌదరిని కోరగా, కేంద్రాన్ని ఒప్పించడంలో సుజనా విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.
ఇక, దాదాపు ఏడాదిన్నర పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలవని చంద్రబాబు, అప్పట్లో పలుమార్లు అపాయింట్ మెంట్ కోసం సుజనాతో లాబియింగ్ చేయించగా, ఈ విషయంలోనూ సుజనా ఫెయిల్ అయ్యారట. దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక చోట కూర్చోబెట్టే పనిని కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా చేయలేకపోయారని సుజనా చౌదరి వద్దే చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి, స్వప్రయోజనాలు, బీజేపీ ప్రయోజనాలకు సుజనా చౌదరి ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు భావిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కేంద్ర రాజకీయాల్లో యువ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరపు రామ్మోహన్ నాయుడు లను ప్రోత్సహిస్తూ, సీనియర్ అయిన తనను పక్కన పెడుతున్నారని సుజనా మనస్తాపంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని హోదా సెంటిమెంట్ ను కేంద్రం వద్ద చెప్పడంలో సుజనా విఫలమయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేయాలని చంద్రబాబు ఆదేశించిన వేళ, ఆయన అయిష్టతతోనే రాజీనామా చేశారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.