Tamilnadu: ఆయన చెంపను తాకగానే ఒళ్లంతా కంపరం పుట్టింది: 'ది వీక్' రిపోర్టర్ లక్ష్మి
- గత నెలలో మహిళా రిపోర్టర్ చెంప తాకిన తమిళనాడు గవర్నర్
- విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పిన వైనం
- 'ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం' సందర్భంగా గుర్తు చేసుకున్న లక్ష్మీ సుబ్రమణియన్
గత నెలలో లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండిస్తూ, తమిళనాడు గవర్నర్ బన్వరీ లాల్ పురోహిత్ మీడియా సమావేశాన్ని పెట్టిన వేళ, ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకపోగా, మహిళా రిపోర్టర్ చెంప నెమిరిన ఆయన వైఖరి, దేశవ్యాప్తంగా విమర్శలు తెచ్చిపెట్టగా, స్వయంగా ఆయన లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నాటి ఘటనపై 'ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం' సందర్భంగా బాధితురాలు, 'ది వీక్' మహిళా విలేకరి లక్ష్మీ సుబ్రమణియన్ మరోసారి స్పందించారు.
ప్రశ్న అడిగితే, ఇష్టమైతే సమాధానం చెప్పాలి, లేకుంటే లేదని చెప్పాలే తప్ప, తన అనుమతి లేకుండా తనను ఆయన తాకి తప్పు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన తన చెంపను తాకిన క్షణంలో ఒళ్లంతా కంపరం వేసిందని, తన చెంపలను ఎన్నోమార్లు సబ్బుతో కడిగానని, అవమాన భారంతో కన్నీళ్లు రాగా, పక్కనే ఉన్న మరో లేడీ రిపోర్టర్ సముదాయించిందని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు లక్ష్మి.కొన్నాళ్ల క్రితం అన్నాడీఎంకే మంత్రిపై ఆరోపణలు రాగా, వివరణ కోసం వెళ్లానని, ఆ సమయంలో ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా, మనం కలిసి చాలా కాలమైందని గుర్తు చేసిన ఆయన, అప్పట్లో నీకు పెళ్లికాలేదు కదా? ఇప్పుడు పెళ్లి తరువాత లావయ్యావని ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ఆ తరువాతి క్షణమే తేరుకుని, నా శరీరం గురించి మాట్లాడే హక్కు లేదని ఘాటుగానే బదులిచ్చానని, విషయాన్ని పోయిస్ గార్డెన్ లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించానని వెల్లడించారు. ఆపై ఆయన 'మేడమ్' అని సంబోధించారని, తరువాత ఇప్పటివరకూ ఆయన తనతో మాట్లాడలేదని లక్ష్మి చెప్పారు.
మీడియాలో మహిళా విలేకరులు కొన్ని విభాగాలకే పరిమితం కాకుండా, రాజకీయ వార్తా సేకరణలోనూ రాణిస్తున్నారని, అయితే అక్కడక్కడా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. డీఎంకేలో స్టాలిన్ కు హోదాపై తాను ట్విట్టర్ లో కామెంట్ పెడితే, తనను వేధించారని, తన పేరిట నకిలీ ఖాతా సృష్టించి మార్ఫింగ్ ఫొటోలను పెట్టారని ఆరోపించారు. ఇటువంటి వేధింపులను తలచుకుంటే తనకెంతో బాధనిపిస్తోందని తన అనుభవాలను ఓ పత్రికతో పంచుకున్నారు.