rahul gandhi: బీజేపీ ముక్త్ భారత్ ను మేము కోరుకోవడం లేదు: రాహుల్ గాంధీ
- బీజేపీని ఎదుర్కొంటా.. ఓడిస్తా
- ఆరెస్సెస్ వాదం కర్ణాటకలో పని చేయడం లేదు
- మోదీని ప్రజలు భరించలేకపోతున్నారు
కాంగ్రెస్ ముక్త్ భారత్ (కాంగ్రెస్ లేని భారత్) నినాదంతో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ ముక్త్ భారత్ ను తాను కోరుకోవడం లేదని తెలిపారు. బీజేపీని తాను ఎదుర్కొంటానని, బీజేపీని ఓడిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి పోయిన నేతలు కూడా ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారని చెప్పారు. ఆరెస్సెస్ జాతీయవాదం కర్ణాటకలో పారడం లేదని తెలిపారు. కర్ణాటక ప్రజల గొంతుకలకు, ఆరెస్సెస్ (మోదీ)కి మధ్య జరుగుతున్న పోటీనే కర్ణాటక ఎన్నికలని చెప్పారు. తప్పులు చేస్తున్న నరేంద్ర మోదీలాంటి వ్యక్తులను భారతీయులు భరించలేకపోతున్నారని అన్నారు.
ఉద్యోగాలు, అవినీతి, రైతు సంక్షేమం అంటూ 2014లో మోదీ అధికారంలోకి వచ్చారని.... ఈ మూడు అంశాల్లో కూడా ఆయన దారుణంగా విఫలమయ్యారని రాహుల్ చెప్పారు. గుజరాత్ లో బీజేపీ మొదట ఫెయిల్ అయిందని, ఇప్పుడు కర్ణాటకలో ఓడిపోతుందని, ఆ తర్వాత వరుసగా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఇదే రిపీట్ అవుతుందని అన్నారు.