dachepalli: దాచేపల్లి ఘటనపై విచారణ ముమ్మరం చేశాం : ఏపీ డీజీపీ మాలకొండయ్య
- మానసిక వైకల్యంతో ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నా
- నిందితుడు సుబ్బయ్య రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు
- ఇద్దరు భార్యలూ ఆయన్ని వదిలేశారు
- నిందితుడి కోసం 17 బృందాలు రంగంలోకి దిగాయి
గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటన బాధాకరమని ఏపీ డీజీపీ మాలకొండయ్య అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటం దారుణమైన విషయమని, మానసిక వైకల్యంతో ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నామని, ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేశామని, త్వరలో నిందితుడు సుబ్బయ్యను పట్టుకుంటామని చెప్పారు. ఆందోళనలు, విధ్వంసాలు సృష్టించడం తగదని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
నిందితుడు సుబ్బయ్య రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఇద్దరు భార్యలూ ఆయన్ని వదిలేశారని చెప్పారు. ఈ సంఘటన అనంతరం సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందని, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు 17 బృందాలు రంగంలోకి దిగాయని, ముమ్మరంగా గాలిస్తున్నాయని అన్నారు. బాలికలపై అత్యాచారాలను తీవ్రంగా పరిగణిస్తామని, వీలైనంతగా త్వరగా చార్జిషీట్ దాఖలు చేస్తామని, అత్యాచార ఘటనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. నిర్భయ చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పోలీస్ గస్తీ, దాచేపల్లిలో 144 సెక్షన్ కొనసాగుతుందని రూరల్ ఎస్పీ తెలిపారు.