Kadapa District: రాజీనామా చేస్తానంటున్న బద్వేలు ఎమ్మెల్యే... పెద్దగా పట్టించుకోని టీడీపీ అధినేత!
- బద్వేలు నుంచి వైసీపీ తరఫున గెలిచిన జయరాములు
- ఆపై తెలుగుదేశంలో చేరిక
- ఆధిపత్యం చూపుతున్న విజయమ్మ వర్గం
- అసంతృప్తితో ఉన్న జయరాములు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బద్వేలు నుంచి విజయం సాధించి, ఆపై టీడీపీలో చేరిన జయరాములు, ఇప్పుడు అక్కడి పాత నేతల ఆధిపత్య ధోరణిని తట్టుకోలేక, రాజీనామా చేస్తానని అంటుండగా, తెలుగుదేశం అధిష్ఠానం పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఆయన అసంతృప్తికి కారణాలను అన్వేషిస్తే, ఎంతో కాలం పాటు జనరల్ నియోజకవర్గంగా ఉన్న బద్వేలులో చక్రంతిప్పిన మాజీ మంత్రి వీరారెడ్డి మరణం తరువాత ఆయన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే విజయమ్మదే ఆధిపత్యం.
అయితే, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో టీడీపీ విజయజ్యోతిని తెరపైకి తేగా, వైసీపీ జయరాములును నిలిపింది. 2014 ఎన్నికల్లో జయరాములు విజయం సాధించాడు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరారు. ఇప్పుడు బద్వేలు టీడీపీలో మూడు గ్రూపులు తయారయ్యాయి. విజయమ్మ, విజయజ్యోతి, జయరాములు ముగ్గురూ మూడు గ్రూపులుగా ఉండి, నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు.
ఇక అధికార కార్యక్రమాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను పక్కనబెట్టి, అగ్రవర్ణాలకు చెందిన విజయమ్మ తన హవాను కొనసాగిస్తోందని అంటున్నారు జయరాములు. దీంతో తాను ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానన్నది ఆయన ఆరోపణ. ఎస్సీ అసెంబ్లీలో అగ్రవర్ణాల పెత్తనమేంటని మీడియా ముందు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, విషయాన్ని మంత్రులు, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితి మారలేదని అన్నారు. ఇక ఆయనకు పెద్దగా రాజకీయాల్లో అనుభవం లేనందునే విజయమ్మ పట్టు కొనసాగుతోందని తెలుస్తుండగా, పదవికి రాజీనామా చేస్తానన్నా పెద్దగా పట్టించుకోని కారణం కూడా అదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.