gali janardhan reddy: గాలి జనార్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు... బళ్లారిలో ప్రచారం చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశం
- బళ్లారిలోకి అడుగు పెట్టకుండా ఆయనపై నిషేధం
- పది రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలంటూ ‘గాలి’ అభ్యర్థన
- ఆ అవసరం లేదన్న కోర్టు
గనుల అక్రమ తవ్వకాల కేసులను ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 12న ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బళ్లారిలోకి ప్రవేశించకుండా 2015లో బెయిల్ మంజూరు సమయంలోనే కోర్టు నిషేధం విధించింది.
అయితే, తన సోదరుడు, బళ్లారి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించేందుకు పది రోజుల పాటు నిషేధాన్ని పక్కన పెట్టాలని గాలి జనార్దన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే, ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఆయనకు లేదని కోర్టు స్పష్టం చేసింది. బళ్లారి సమీపంలో గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే మకాం వేసి తన సోదరుడితోపాటు చిత్రదుర్గలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న స్నేహితుడు బి.శ్రీరాములు విజయానికి పావులు కదుపుతున్నారు.