Chandrababu: ఏపీలో అత్యాచారాలకు పాల్పడితే, ఇక వారికి భూమి మీద అదే చివరిరోజు అవుతుంది: దాచేపల్లి ఘటనపై చంద్రబాబు
- అత్యాచారం చేయాలనుకునేవారు భయపడేలా వ్యవహరిస్తాం
- మీ ఇంట్లో ఎవరైనా ఇటువంటి వారు ఉంటే సరి చేసుకోవాలి
- సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం
- రేపు ఆసుపత్రికి వెళ్లి బాధిత బాలికను పరామర్శిస్తాను
ఇటీవల జరిగిన కథువా, ఉన్నావో వంటి వరుస ఘటనలు దేశాన్నే కలచి వేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. "అదే విధంగా మన రాష్ట్రంలో కూడా కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ తయారవుతున్నారు. అందుకే నేను చెబుతున్నాను. ఇదొక హెచ్చరిక కావాలి. ఎవ్వరినీ వదిలి పెట్టము. ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేరం చేసినా ఏమీ జరగబోదనే ధీమా ఎవ్వరిలోనూ ఉండడానికి వీల్లేదు.
రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఎవ్వరయినా మరోసారి ఇటువంటి ఘటనకు పాల్పడితే కఠిన శిక్ష ఎదుర్కొంటారు. అందరూ గుర్తు పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్మాదుల్లా తయారవుతుంటే వారిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసమే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తాం. విజయవాడలో నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ రాష్ట్రంలోని అందరూ పాల్గొనండి, ప్రజల్లో అవగాహన తీసుకురండి" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
రేపు తాను గుంటూరు ఆసుపత్రికి వెళ్లి బాధిత బాలికను పరామర్శించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఏపీలో అత్యాచారాలకు పాల్పడితే భూమి మీద అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం చేయాలనుకునేవారు భయపడేలా వ్యవహరిస్తామని అన్నారు.