Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బిచ్చగాళ్లగా మార్చే ప్రయత్నం చేస్తోంది: కేరళ ఆర్థిక మంత్రి థామస్
- రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం ఇదంతా చేస్తోంది
- 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి నష్టమే
- ఈ సిఫార్సులు అమల్లోకొస్తే ఏపీకి రూ.8 వేల కోట్లు నష్టం వస్తుంది
- ఏపీ డిమాండ్లు నిజాయతీతో కూడుకున్నవి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బిచ్చగాళ్లలా మార్చే ప్రయత్నం చేస్తోందంటూ కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు థామస్ ఇసాక్ ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం ఇదంతా చేస్తోందని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే ఏపీకి రూ.8 వేల కోట్లు, తమిళనాడుకు రూ.10 వేల కోట్ల నష్టం వస్తుందని అన్నారు. ఏపీ డిమాండ్లు నిజాయతీతో కూడుకున్నవని అన్నారు. చెరకు రైతులపై ప్రేమ చూపించిన విధంగానే రబ్బర్, కాటన్ రైతులపైనా ఎందుకు ప్రేమ చూపించడం లేదని ప్రశ్నించారు.
పొలిటికల్ మైలేజ్ కోసం కేంద్రం ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ఏపీ ఆర్థికలోటు భర్తీ చేస్తామంటూ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ సమావేశం తర్వాత రాష్ట్రపతికి ఓ వినతిపత్రం పంపుతామని అన్నారు.