Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్ టవర్స్ ను హైదరాబాద్లో నిర్మిస్తాం: కేటీఆర్
- పదేళ్లు పూర్తి చేసుకున్న ఛోటా భీమ్
- హెచ్ఐసీసీలో కార్యక్రమం.. పాల్గొన్న కేటీఆర్
- యానిమేషన్ రంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది
- యానిమేషన్ రంగానికి సర్కారు ప్రాధాన్యమిస్తోంది
ఛోటా భీమ్ ప్రోగ్రాం పిల్లలనే కాకుండా పెద్దలను కూడా ఆకట్టుకుని విపరీతంగా పాప్యులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రాంకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అభిమానేనట. ఈ విషయాన్ని కేటీఆరే స్వయంగా చెప్పారు. ఛోటా భీమ్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.... ఇలాంటి కార్టూన్ పాత్రలతో పిల్లలకు యానిమేషన్ రంగంపై ఆసక్తి కలుగుతుందని, ఛోటా భీమ్ ప్రాంతాలు, భాషలకు అతీతంగా పాప్యులారిటీ సంపాదించుకుందని తెలిపారు. కాగా, యానిమేషన్ రంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, గేమింగ్ ఎంటర్టైన్మెంట్ యానిమేషన్ రంగానికి తమ సర్కారు ప్రాధాన్యమిస్తోందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్ టవర్స్ ను హైదరాబాద్లో నిర్మిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.