thunder storm: నేడు 20 రాష్ట్రాల్లో వడగళ్ల వానలు... గాలి దుమారాలు... ఢిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తత
- భారత వాతావరణ శాఖ హెచ్చరిక
- ఢిల్లీ, హర్యానాలో స్కూళ్లకు సెలవు
- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
నేడు, రేపు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలను ఉరుములు, గాలితో కూడిన వడగళ్ల వానలు ముంచెత్తనున్నాయంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళ, సిక్కిం, జార్ఖండ్, యూపీ, త్రిపుర, మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, మేఘాలయా, అసోం, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
దీంతో ఉత్తరాది రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వారం క్రితం గాలిదుమారంతో కూడిన వానలతో 124 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. అత్యవసర సేవల్లోని వారిని అందుబాటులో ఉండాలని ఆదేశించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి వర్షం సమయంలో బయటకు రావద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఒకవేళ వర్షంలో చిక్కుకుపోతే కాంక్రీటు భవనాలనే ఆశ్రయించాలని సూచించారు.