walmart: బిగ్ డీల్! వాల్‌మార్ట్ గూటికి ఫ్లిప్‌కార్ట్.. నేడు ప్రకటన!
- గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి
- అమెజాన్‌కు ఎదురుదెబ్బ
- ఫ్లిప్‌కార్ట్‌తో డీల్‌ను ప్రకటించనున్న వాల్‌మార్ట్ సీఈవో
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్-అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ డీల్ దాదాపు పూర్తయింది. ఫ్లిప్‌కార్ట్‌లో 70 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు వాల్‌మార్ట్ నేడు ప్రకటించనుంది. ఇప్పటికే బెంగళూరు చేరుకున్న వాల్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డౌగ్ మెక్‌మిలన్ డీల్‌పై నేడు ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అనంతరం మెక్ మిలన్ ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ అధికారులను కలిసి డీల్ గురించి, వాల్‌మార్ట్ ప్రణాళికల గురించి వివరించనున్నారు.
నిజానికి ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకునేందుకు మరో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించింది. వాల్‌మార్ట్ ఆఫర్ చేస్తున్న దానికంటే పదిశాతం ఎక్కువ ఇచ్చేందుకు సైతం ముందుకొచ్చింది. అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ మాత్రం వాల్‌మార్ట్‌వైపే మొగ్గుచూపింది. ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక వాటా కలిగిన సాఫ్ట్‌బ్యాంకు సైతం అమెజాన్ ఆఫర్ గురించి ఆలోచించాలని చేసిన విజ్ఞప్తిని ఇతర పెట్టుబడిదారులు తిరస్కరించడంతో చివరికి సాఫ్ట్‌బ్యాంకు సైతం తలొగ్గక తప్పలేదు.
తొమ్మిదేళ్లుగా ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా ఉన్న సచిన్ బన్సల్ కంపెనీలో తనకున్న 5.5 శాతం షేర్లను విక్రయించి నిష్కృమిస్తుండగా, టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్‌నర్స్, టెన్సెంట్ సంస్థలు కొద్దిపాటి షేర్లను అట్టే పెట్టుకోనున్నాయి. అత్యధిక షేర్లు కలిగిన సాఫ్ట్‌బ్యాంక్, నాస్పెర్స్ సంస్థలు మొత్తం వాటాను విక్రయించనున్నాయి.