amazon india: అమేజాన్ ఇండియాకు తాజాగా రూ.2,600 కోట్ల పెట్టుబడులు
- మాతృసంస్థ అమేజాన్ అందజేత
- ఈ ఏడాది జనవరి, గతేడాది నవంబర్ లోనూ ఇదే మాదిరిగా నిధులు
- పోటీని ఎదుర్కొనేందుకు ధన బలం
అమేజాన్ ఇండియాకు తాజాగా తన మాతృసంస్థ అమేజాన్ నుంచి రూ.2,600 కోట్ల నిధులు తరలివచ్చాయి. ఫ్లిప్ కార్ట్ తర్వాత అమేజాన్ దేశంలో రెండో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అని తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనుగోలు చేస్తున్న తరుణంలో పోటీని ఎదుర్కొనేందుకు అమేజాన్ ఇండియాకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయి. తాజా నిధులతో కూడా కలుపుకుని చూస్తే అమేజాన్ ఇండియాపై అమేజాన్ పెట్టుబడులు రూ.20,000 కోట్లను దాటేశాయి.
అయితే, తాజా నిధుల అందజేత సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనుగోలుకు దీనితో సంబంధం లేదని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. అమేజాన్ ఇండియా ఈ ఏడాది జనవరిలో ఇదే మాదిరిగా మాతృ సంస్థ నుంచి రూ.1,950 కోట్ల నిధులను సమీకరించింది. గతేడాది నవంబర్ లో రూ.2,990 కోట్లు తరలివచ్చాయి. పోటీని ఎదుర్కొని కస్టమర్లను, మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు అమేజాన్ ఎప్పటికప్పుడు భారీగా నిధుల్ని వెచ్చిస్తోంది.