assom: సమస్యలు చెప్పొద్దంటూ... మైక్ లాక్కుని, స్విచ్ ఆపేసిన కేంద్ర మంత్రి!
- కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గోహెన్ దురుసు ప్రవర్తన
- సమస్యలు చెబుతున్న విశ్రాంత టీచర్ పై ఆగ్రహం
- వేదికపై అలా మాట్లాడొద్దన్న వైనం
వేదికపైకి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటోన్న ఓ వ్యక్తి నుంచి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గోహెన్ మైకు లాక్కొన్నారు. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా అసోంలోని నాగోన్ జిల్లాలో ఇటీవల ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
విశ్రాంత ఉపాధ్యాయుడు ఒకరు వేదికపైకి వచ్చి.. తమ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి సరిగా లేదని, ట్రాఫిక్ జామ్ సమస్యలతో పాటు ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉందని, కొత్త ప్రభుత్వం, కొత్త ఎమ్మెల్యే తమ కష్టాలు తీరుస్తారని ఆశించామని, చాలా సార్లు ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం లేదని అన్నారు.
ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆగ్రహం తెచ్చుకున్న కేంద్రమంత్రి కుర్చీలోంచి లేచి వచ్చి మైక్ లాక్కుని, పక్కనే ఉన్న స్విచ్ ఆపేశారు. అనంతరం ఇటువంటి చిన్న విషయాలు అధికారులతో మాట్లాడాలని కసురుకున్నారు. ఏదైనా సమస్య వస్తే తనను వ్యక్తిగతంగా కలవాలని చెప్పుకొచ్చారు. ఇలా ప్రజలముందు మాట్లాడవద్దని, అలా చేస్తే ప్రజలకు తమ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు. దీంతో అక్కడి ప్రజలు సదరు కేంద్రమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.