Donald Trump: ఇరాన్ పార్లమెంటులో అమెరికాకు ఘోర అవమానం!
- ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అమెరికా
- ట్రంప్ తీరుపై ఇరాన్ పార్లమెంటులో నిరసనలు
- జాతీయ జెండాను తగలబెట్టి నినాదాలు
బరాక్ ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తాజాగా ట్రంప్ సర్కారు తెంచేసుకోవడంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినందుకు నిరసగా పార్లమెంటులో అమెరికా జాతీయ జెండాను తగలబెట్టి ఘోరంగా అవమానించింది.
బుధవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే అమెరికా తీరుపై నిరసన వ్యక్తం చేసిన సభ్యులు, ఆ దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం యూఎస్ జాతీయ పతాకాన్ని తీసి నిప్పుపెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ఈ సందర్భంగా కొందరు సభ్యులు మాట్లాడుతూ ట్రంప్ అనవసరంగా తమపై బురద జల్లుతున్నారని, అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందని అన్నారు. తమ ప్రయత్నాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇరాన్‌తో అణు సంబంధాలను తెంచుకుంటున్నట్టు మంగళవారం ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, 2015 ఒప్పందంలో ఎత్తివేసిన ఆంక్షలన్నింటినీ తిరిగి ఇరాన్‌పై విధిస్తామని ప్రకటించారు. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మరే దేశమైనా ఇరాన్‌కు సహకారం అందిస్తే అమెరికా తీసుకునే చర్యలకు గురికావాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.