Donald Trump: నోబెల్ శాంతి బహుమతి అక్కర్లేదు... ప్రపంచం గెలవాలి: ట్రంప్ కొత్త పలుకు
- అదే నేను కోరుకునే బహుమతి
- చైనా అధ్యక్షుడు మాకు సాయపడ్డారు
- ఆయనకు ధన్యవాదాలు
తనకు నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడం పట్ల ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచం గెలవాలని మాత్రం కోరుకుంటున్నట్టు చెప్పారు. నోబెల్ శాంతి బహుమతికి మీరు అర్హులేనా? అంటూ ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు ట్రంప్ అలా స్పందించారు. తాను అర్హుడినేనని ప్రతి ఒక్కరూ భావిస్తారని చెప్పారు. కానీ తాను మాత్రం అలా చెప్పనన్నారు.
తాను కోరుకునే బహుమతి ప్రపంచం విజయం సాధించడమే అని చెప్పారు. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ ప్రయత్నాలను మెచ్చుకుంటూ ఆయన నోబెల్ శాంతి పురస్కారానికి అర్హులని దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే. ‘‘ఇది (సయోధ్య) జరిగి తీరుతుందని చాలా మంది భావించి ఉండరు. ఇది ఉత్తరకొరియాకు, దక్షిణ కొరియాకు, జపాన్ కు చాలా మంచిది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. రెండు రోజుల క్రితం ఆయన ఓ అంశంలో మాకు ఎంతో సాయం చేశారు’’ అని ట్రంప్ వివరించారు.