Vijayawada: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం... అంతకంతకూ విస్తరిస్తున్న అగ్నికీలలు!
- ఆటోనగర్ లో ప్రమాదం
- తగలబడుతున్న ప్లాస్టిక్, ఇంజనాయిల్ సంస్థలు
- మంటలను అదుపు చేయలేని పరిస్థితి
విజయవాడ, కానూరు రోడ్డులోని ఆటోనగర్లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత ఓ కూలర్ల తయారీ కంపెనీలో మొదలైన మంటలు, పక్కనే ఉన్న ఇంజనాయిల్ మిక్సింగ్ సంస్థకు వ్యాపించాయి. ఆపై చుట్టుపక్కల ఉన్న చిన్నా, చితక కంపెనీలను కబళిస్తూ అంతకంతకూ మరింత ఉద్ధృతంగా మారడంతో, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నా, తగలబడుతున్నది ప్లాస్టిక్, ఇంజనాయిల్ పరిశ్రమలు కావడంతో ఏ మాత్రం మంటలు తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. చుట్టుపక్కల పలు ఫ్యాక్టరీలు ఉండటంతో భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు వారిని హుటాహుటిన ఖాళీ చేయించారు.
అక్కడే ఉన్న హ్యుందాయ్ కార్ల కంపెనీలోని కార్లనూ బయటకు తెప్పించారు. విజయవాడలో ఎక్కడి నుంచి చూసినా మంటల కారణంగా గాల్లోకి లేచిన పొగ కనిపిస్తోంది. మంటలు రోడ్డుపైకి రాకుండా, కార్బన్ డై ఆక్సైడ్ పౌడర్ ను అధికారులు చల్లిస్తున్నారు. ఫైరింజన్లతో మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, మొత్తం ఆహుతైన తరువాతే దగ్గరికి వెళ్లే అవకాశాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.