KCR: నాకున్న కరీంనగర్ సెంటిమెంట్ ఇదే!: కేసీఆర్
- 'రైతుబంధు' పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్
- కరీంనగర్ నుంచి ప్రారంభిస్తే విజయవంతం అవుతుంది
- రాష్ట్రమంతా నాకు సమానమే
- ఎన్నో విషయాల్లో తెలంగాణ ముందుందన్న కేసీఆర్
తనకు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం, సెంటిమెంట్ ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం హుజూరాబాద్ లో రైతుకు ఎకరానికి రూ. 8 వేలను అందించే 'రైతుబంధు' పథకాన్ని ప్రారంభించిన ఆయన, ఆపై భూ ప్రక్షాళన తరువాత తొలిసారిగా రైతులకు పాస్ పుస్తకాలు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ లో తాను ప్రారంభించిన ఏ పని లేదా పథకమైనా నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందన్న సెంటిమెంట్ తనకుందని, అందువల్లే 'రైతుబంధు'ను కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నానని చెప్పారు.
తనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ సమానమేనని, దీని తరువాత తాను ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తానని చెప్పారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి పోరాటాన్ని కూడా కరీంనగర్ నుంచి ప్రారంభించామని గుర్తు చేశారు. చాలామంది తనను శపించారని, కానీ 14 సంవత్సరాల పోరాటం తరువాత రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని ప్రజల హర్షాతిరేకాల మధ్య వ్యాఖ్యానించారు.
రాష్ట్రం సిద్దించే సమయంలో ఎన్నో విమర్శలు చేశారని, ఆ సన్నాసులకు తాను ఒకటే చెప్పదలచుకున్నానని, ఇదే కరీంనగర్ జిల్లాకు చెందిన మెట్ పల్లి బిడ్డ అనుదీప్, ఐఏఎస్ గా ఆలిండియా స్థాయిలో తొలి ర్యాంకు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. (ఆ సమయంలో మంత్రి ఈటల రాజేందర్ వచ్చి తమ హుజూరాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి కూడా ర్యాంకులు వచ్చాయని గుర్తు చేశారు.) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, "మా మంత్రికి కోపం వచ్చింది" అని సరదాగా వ్యాఖ్యానిస్తూ, వారిని కూడా తాను ప్రత్యేకంగా సన్మానిస్తానని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రజలందరికీ 24 గంటలూ కరెంటు ఇస్తున్న ఘనత తెలంగాణదేనని, హోమ్ గార్డులకు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్టం మనదేనని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ. 1000 పెన్షన్ ఇస్తున్నది మనమేనని అన్నారు. రాష్ట్రంలో కులాలు, మతాలు తేడాలేకుండా అందరినీ ఆదుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు. సత్యం, ధర్మం మనవైపే ఉన్నాయని అన్నారు. ఇండియాలో 20 శాతం సొంత ఆదాయం కలిగిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని, చాలా రాష్ట్రాల్లో ఎస్ఓఆర్ (స్టేట్ ఓన్డ్ రెవెన్యూ) 10 శాతంలోపే ఉందని వ్యాఖ్యానించారు.