redmi 2s: రెడ్ మీ ఎస్2 స్మార్ట్ ఫోన్ విడుదల... పెద్ద స్క్రీన్... ఫేస్ అన్ లాక్
- 18:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్
- 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ తో రెండు రకాలు
- సెల్ఫీల కోసం అనువుగా ఏఐ టెక్నాలజీ వినియోగం
షియోమీ కంపెనీ రెడ్ మీ బ్రాండ్ పై ఎస్2 స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. అతి త్వరలోనే ఇది మన మార్కెట్లోకి రానుంది. ఇది మిగిలిన ఫోన్లకు భిన్నంగా ఉండడం గమనార్హం. ప్రధానంగా సెల్ఫీ ఫోన్ గా కంపెనీ దీన్ని రూపొందించింది. ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. ఫేస్ అన్ లాక్ ను కూడా ఏర్పాటు చేసింది. రెడ్ మీ నుంచి ఫేస్ అన్ లాక్ తో వచ్చిన ఫోన్ ఇదే.
ఇందులో డ్యుయల్ సిమ్, అదనంగా మెమొరీ కార్డు కోసం వేరే స్లాట్ ను ఏర్పాటు చేసింది. 5.99 అంగుళాల హెచ్ డీ+ 18:9 యాస్పెక్ట్ రేషియోతో స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీతో ఒక వేరియంట్, 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీతో మరో వేరియంట్ ను తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆధారంగా పనిచేస్తుంది. వెనుక భాగంలో 12+5 మెగా పిక్సల్ తో రెండు కెమెరాలను ఏర్పాటు చేసింది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. బరువు 170 గ్రాములు. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర చైనాలో సుమారు రూ.10,500 కాగా, 4జీ ర్యామ్ ధర రూ.13,800.