Congress: రాహుల్ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ నష్టపోయింది: బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైంది
- కర్ణాటకలోనూ అదే జరుగుతుంది
- రాహుల్ ప్రధాని కావాలని కలలు కనొచ్చు
- కానీ, ఆయనకు ప్రజలు మాత్రం ఆ అవకాశం ఇవ్వరు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉంది. రాహుల్ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. 2019 ఎన్నికల తర్వాత తాను ప్రధానిని అవుతానని రాహుల్ కలలు కంటున్నారని, అది నిజం కాబోదన్నారు. మరోసారి నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ వచ్చిన షానవాజ్ హుస్సేన్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘రాహుల్ గాంధీ తనకు తానే పీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఆయన్ను పీఎంగా చేసేవారు ఎవరూ లేరక్కడ. ప్రధాని అవుతానని కలలు కనే హక్కు ఆయనకు ఉంది. కానీ, ప్రజలు మాత్రం ఆయన్ను ప్రధానిగా ఎన్నుకోరు’’ అని హుస్సేన్ అన్నారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత ఆ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోనూ అదే జరుగుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సూచించారు. ఎన్డీయే సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, ప్రతీ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు తమ నమ్మకాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేస్తున్నారని అన్నారు.