kurnool: కర్ణాటక ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటేయమని నేను చెప్పలేదు!: సీఎం చంద్రబాబు
- అన్యాయం చేసిన వాళ్లకు ఓటు వేయవద్దని మాత్రం చెప్పా
- అవినీతి కేసులున్న పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చూస్తోంది
- రాష్ట్రం కోసం పోరాడుతున్న నాపై వైసీపీ వ్యాఖ్యలు సబబు కాదు
కర్ణాటక ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటేయమని తాను చెప్పలేదని, మనకు అన్యాయం చేసిన వాళ్లకు మాత్రం ఓటు వేయద్దని మాత్రం చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో ఈరోజు పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ, అవినీతి కేసులు ఉన్న పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తనపై వైసీపీ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ, విమర్శిస్తోందని మండిపడ్డారు.
అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైసీపీ నేతలు బీజేపీతో లాలూచీ పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కాగా, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల నిమిత్తం విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, సెప్టెంబర్లో ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు ప్రారంభం కానుందని చంద్రబాబు చెప్పారు.